నాన్ స్టాప్: రూ. 5/- భోజనం

SMTV Desk 2017-05-29 13:09:38  annapurna,food rs5,ghmc,Rs 5 meals,

హైదరాబాద్, మే 28 : హైదరాబాద్ నగరానికి వివిధ పనులపై వచ్చే పేదలకు ఆకలిని తీర్చేందుకు ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రూ. 5 భోజన పథకం అన్నపూర్ణ కోటి మందిని చేరింది. నిత్యం 45 వేల మంది ఆకలి తీర్చుతున్న ఈ కేంద్రాల ద్వారా గడిచిన రెండేండ్లలో కోటి మందికిపైగా భోజనం చేశారు. దీన్ని మరింత ఎక్కువ మందికి చేరువ చేసే ఉద్దేశంతో కేంద్రాల సంఖ్యను 141 నుంచి 150కి పెంచేందుకు GHMC ఏర్పాట్లు చేస్తోంది. దేశంలోనే మొదటి సారిగా మార్చి 2వ తేదీ, 2014న నాంపల్లి సరాయిలో ఈ అన్నపూర్ణ భోజన పథకాన్ని ప్రారంభించారు. హరేకృష్ణ ఫౌండేషన్ భాగస్వామ్యంతో GHMC నిర్వహిస్తున్న ఈ కేంద్రాల సంఖ్య ప్రస్తుతం 141కి చేరింది. ఒక్కో కేంద్రంలో 300 నుంచి 400 మంది చొప్పున ప్రతిరోజూ 45వేల మంది ఆకలి తీర్చుకుంటున్నారు. వీరిలో కూలీలు, విద్యార్థులు, ఆటోడ్రైవర్లు, రోగుల సహాయకులు, నగరానికి వచ్చే వారే ఎక్కువ. ప్రతిరోజు ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు రూ.5 భోజనం అందుబాటులో ఉంటుంది. ఒక్కో భోజనానికి రూ.24.25 ఖర్చవుతుండగా, రూ.19.25 జీహెచ్‌ఎంసీ భరిస్తున్నది. ఇప్పటి వరకు దాదాపు కోటి మంది భోజనం చేయగా, జీహెచ్‌ఎంసీ రూ.20 కోట్ల వరకు ఖర్చు చేసింది. సిటీ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీతో పాటు కోచింగ్ కేంద్రాలు ఉన్న అశోక్‌నగర్, అమీర్‌పేట్ ప్రాంతాల్లో అన్నపూర్ణ క్యాంటీన్లను నిరుద్యోగులకు కడుపు నింపుతున్నాయి. అలాగే నిమ్స్, ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, పేట్ల బుర్జు, కోఠి ఈఎన్‌టీ, నాచారం, ఎర్రగడ్డ ఈఎస్‌ఐ, బసవతారకం క్యాన్సర్ దవాఖానకు వచ్చే రోగుల సహాయకులకు ఈ భోజనం అందుతున్నది. అన్నపూర్ణ కేంద్రాలను ప్రస్తుతానికి 150కి పెంచాలని భావిస్తున్నా, అవసరమైతే మరిన్ని నెలకొల్పడానికి సిద్ధమని నగర మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టంచేశారు.