అతనితో షాంపెన్‌ బాటిల్‌ పంచుకుంటా : సచిన్

SMTV Desk 2018-04-24 16:21:15  sachin tendulkar, kohli, sachin birth day, master blaster

ముంబై, ఏప్రిల్ 24 : భారత క్రికెట్ లోనే కాకుండా, ప్రపంచ క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ రికార్డులు బద్దలు కొట్టడం అంతా సాధ్యమై పనికాదు. కానీ ఒక్క బ్యాట్స్ మెన్ మాస్టర్ బ్లాస్టర్ రికార్డును తిరగారాస్తాడని క్రీడావిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అతనెవరో కాదు.. భారత క్రికెట్ ప్రస్తుత సారథి విరాట్ కోహ్లి. ఇప్పుడు అదే విషయాన్ని సచిన్ కూడా అన్నారు. వన్డేల్లో తన పేరిట ఉన్న అత్యధిక సెంచరీల(49) రికార్డును టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అధిగమిస్తాడని దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అభిప్రాయపడ్డాడు. క్రికెట్‌ చరిత్రలో​ చెరుగని ముద్ర వేసుకున్న సచిన్‌ నేడు 45వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తన పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్‌ తన రికార్డు బ్రేక్‌ అనంతరం కెప్టెన్‌ కోహ్లితో షాంపెన్‌ బాటిల్‌ను పంచుకుంటానన్నాడు."నేను అతనికి షాంపెన్‌ బాటిల్‌ను పంపించను. నా రికార్డును అధిగమించిన అనంతరం నేనే స్వయంగా వెళ్లి అతనితో షాంపెన్‌ బాటిల్‌ను పంచుకుంటా" అని సచిన్‌ వ్యాఖ్యానించాడు. కోహ్లి బ్యాటింగ్‌లో సూపర్‌ ఫాస్ట్‌ ట్రైన్‌లా దూసుకుపోతున్నాడు. వన్డేల్లో​ ఇప్పటికే 35 సెంచరీలు సాధించిన కోహ్లి.. సచిన్‌ రికార్డు (49)ను అధిగమించడానికి మరో 15 సెంచరీల దూరంలో ఉన్నాడు. ఇదే ఫామ్‌తో రాణిస్తే మరికొద్ది రోజుల్లోనే కోహ్లి ఈ ఘనతను అందుకుంటాడు.