కేసీఆర్ గురువు మృతి

SMTV Desk 2017-07-05 17:44:30  Umapati Padmanabha Sharma, Died, kcr, harishravu, hospitel, hyderabad, siddipet

హైదరాబాద్, జూలై 5 : ప్రముఖ సాహిత్యకారుడు, పండితుడు, బహుముఖ ప్రజ్ఞాశాలైన ఉమాపతి పద్మనాభశర్మ (90) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రోజున తుదిశ్వాస విడిచారు. తొలితరం కథారచయితగా, కవిగా, వేణుగాన విద్వాంసులుగా, ఆధ్యాత్మికవేత్తగా ఆయన ప్రజలకు సుపరిచితులు. హైదరాబాద్ అల్వాల్‌లోని కుమారుని నివాసంలో ఉంటున్న శర్మకు ఇటీవల తుంటి ఎముక విరిగింది. దీంతో కుటుంబసభ్యులుఆసుపత్రిలో చేర్చగా, ఆయన చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు. శర్మకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెండేండ్ల క్రితమే భార్య చనిపోయారు. ఉమాపతి పద్మనాభశర్మ స్వస్థలం సిద్దిపేట జిల్లా అక్కడి పారుపల్లివీధిలో నివాసం. సాహితీ వికాసమండలికి చాలాకాలం అధ్యక్షుడుగా వ్యవహరించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. వృతిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, లెక్చరర్‌గా పనిచేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పుల్లూరు హైస్కూల్‌లో చదివే రోజుల్లో శర్మ ఆయనకు గురువు. సాహిత్యానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గత జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావదినోత్సవాల సందర్భంగా ఆయనకు తెలంగాణ విశిష్ట పురస్కారం ఇచ్చి సత్కరించింది. ఈ సందర్భంగా గురువు పద్మనాభశర్మ మరణం పట్ల సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు. సాహితీరంగంలో శర్మ సేవలను కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. శర్మ మృతికి భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సంతాపం తెలిపారు. సిద్దిపేట బ్రాహ్మణ పరిషత్ శర్మ మృతికి సంతాపం ప్రకటించింది. అధ్యక్షుడు లోకరవిచంద్ర, ప్రధాన కార్యదర్శి నాగరాజు ప్రగాఢ సానుభూతిప్రకటించారు. సాయంత్రం అల్వాల్ హిందూ శ్మశానవాటికలో శర్మ భౌతిక కాయానికి అంత్యక్రియలు చేశారు. ఆయన మరణం పట్ల తెలంగాణ ప్రాంత నేతలు సంతాపం తెలిపారు.