నల్లా నీళ్లివ్వకుంటే ఓట్లడగం: కేసీఆర్

SMTV Desk 2018-04-23 10:55:20  Cm Kcr Mission Bhagiratha Assembly Elections

హైదరాబాద్, ఏప్రిల్ 23‌: వచ్చే ఎన్నికల నాటికి ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీరు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమన్న సవాల్‌కు కట్టుబడి ఉన్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. మిషన్‌ భగీరథ పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంటింటికీ నీరు ఇచ్చే లక్ష్యంతో చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు పనుల గురించి అధికారులతో ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు నాలుగైదు నెలల ముందుగానే ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు నీళ్లిచ్చేలా పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ఏడాది డిసెంబర్ ను గడువుగా పెట్టుకుని పనులు చేయాలని సూచించారు. సమావేశంలో మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, నల్లా మల్లారెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఆర్‌.డబ్లు్య.ఎస్‌ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, సలహాదారు జ్ఞానేశ్వర్, సీఈలు, ఇతర ఉన్నతాధికారులు, వర్కింగ్‌ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.